ప్రముఖ నటుడు, డీఎండీకే(DMDK) అధినేత విజయకాంత్(71)(Vijaykanth) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనాతో బాధపడుతున్న ఆయన మియోట్ ఆస్పత్రిలో మంగళవారం చేరగా గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. విజయకాంత్ 1952, ఆగస్టు 25న జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. 27 ఏండ్ల వయసులో తెరంగ్రేటం చేశారు. ఇక విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే.
విజయకాంత్ తన కెరీర్ మొత్తం తమిళ సినిమాల్లోనే నటించారు. అయినా ఆయన సినిమాలు తెలుగు, హిందీ భాషల్లో డబ్ అయ్యాయి. ‘జదిక్కొరు వీధి’, ‘శివప్పు మల్లి’ (ఎర్ర మల్లెలు రీమేక్) తదితర సందేశాత్మక సినిమాలో నటించారు. దీంతో ఆయన ‘పురాచీ కళింగర్’(విప్లవాత్మక నటుడు) అని తమిళ అభిమానులు పేరు పెట్టారు.
2015 వరకు సుమారు 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా విజయకాంత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దాదాపు 20కి పైగా పోలీసు కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్.. ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఇడి ముళక్కం, సత్తం ఒరు ఇరుత్తరై సినిమాలతో విజయాలు అందుకున్నారు.
100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. విజయ్ కాంత్ చివరి సినిమా మధుర విరన్(2018).. యాక్షన్ హీరోగా విజయ్‌కాంత్‌కి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005 డీఎండీకే పార్టీని స్థాపించారు. 2005 తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.