విశాఖ సాగర తీరం(The coast of Visakhapatnam)లో మత్స్యకారులకు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. తాజాగా మత్స్యకారుల వలకు ఓ విభిన్న తరహా సముద్ర జీవి వలలో చిక్కింది. ఈ జీవిని ‘పఫర్ ఫిష్’(Puffer Fish) అని పిలుస్తారు.
స్థానిక జాలర్లు దీన్ని సముద్ర కప్పలని అంటారని మత్స్యశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ పి.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ చేప సముద్ర జలాల్లో దాడికి గురైన సమయంలో తనను తాను రక్షించుకోవడానికి ఇలా బెలూన్ లాగా మారిపోతుంది. ఈ చేప చూడటానికి కాస్త మనిషిలాగే నోరు, కళ్లు, ముక్కు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగి గ్రామానికి చెందిన అనిల్ అనే మత్స్యకారుడు గుండ్లకమ్మ జలాశయంలో వల వేశారు. వల బయటకు తీసేందుకు ప్రయత్నించగా చాలా బరువుగా అనిపించింది. బయటకు తీసి చూడగా అందులో మొసలి చిక్కుకొని ఉంది. అప్పటికే అది మృత్యువాతపడింది.
సమాచారం అందుకున్న అటవీ, మత్స్యశాఖ అధికారులు వచ్చి పరిశీలించారు. అటవీ శాఖ అధికారి శశిభూషణ్ మొసలిని స్వాధీనం చేసుకున్నారు. అద్దంకి, కొరిశపాడు మండలాల్లో గుండ్లకమ్మ జలాశయం బ్యాక్‌వాటర్ ఎక్కువ గ్రామాల్లో ఉంటుందని, సంబంధిత గ్రామాల్లోని రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.