వైఎస్ వివేకానందరెడ్డి(Vivekananda Reddy) హత్య నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ‘వివేకం’(Vivekam). ఈ సినిమాపై వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి(Dastagiri) హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు(High Court) సీరియస్‌గా స్పందించింది. సెన్సార్ బోర్డు అనుమతి లేకుండా ఆ సినిమాను ఎలా ప్రదర్శిస్తారని ప్రశ్నించింది. నిబంధనలు లేకుండా వ్యక్తుల హక్కులకు భంగం కలిగించదా అంటూ సూటిగా ప్రశ్నించింది.
ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నా సినిమా ఎలా ప్రదర్శించబడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. నారా లోకేష్, టీడీపీ(TDP)పై దస్తగిరి తీవ్ర ఆరోపణలు చేశాడు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో తీసిన వివేకం సినిమా తెలుగుదేశం స్వప్రయోజనాల కోసం వాడుతుందంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉదహరించిడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేసు సీబీఐ కోర్టులో విచారణలో ఉండగా సినిమా తెరకెక్కించడంపై దస్తగిరి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఐటీడీపీ ప్రోత్సహంతోనే ఈ సినిమా అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల్లో ప్రదర్శించబడుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. తక్షణమే ఈ సినిమాను నిలిపివేయాలని దస్తగిరి కోరాడు. పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారణంగా ఈ విధమైన సినిమా ప్రదర్శించబడటం తన హక్కులకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నాడు.
కేవలం రాజకీయ ప్రయోజనాలతో తెలుగుదేశం పార్టీ వెనుక ఉండి ఈ సినిమా ప్రదర్శిస్తుందని ఆరోపించాడు. ఈ మేరకు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ నుంచి తక్షణమే వివరణ తీసుకోవాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక దశలో ఈ విషయమై ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ తరఫు న్యాయవాది ఒక రోజు గడువు కోరగా సుప్రీంకోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.