ఆరుగజాల చీర నేచి అగ్గిపెట్టెలో పెట్టారట..మన నేతన్నలు. బియ్యపు గింజమీద తాజమహల్ చెక్కాడట ఇంకో కళాకారుడు…గ్రాము బంగారు రేకుపై భగవద్గీత రాసాడట ఇంకో స్వర్ణకారుడు. తాజాగా ఉదయ్‌పూర్‌కు చెందిన డాక్టర్ ఇక్బాల్ సక్కా ఇలాంటి అద్భుతాన్నే సృష్టించారు.
దాన్ని చూసిన ప్రజల ఔరా అంటున్నారు.ఇక్బాల్ సక్కా ప్రపంచంలోనే అతి చిన్న బ్యాగ్‌ని తయారు చేశాడు. దీనిని చూడటానికి తప్పకుండా లెన్స్ పెట్టుకోవాల్సిందే. అయితే, ఈ చిన్ని బ్యాగ్ ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది.
ఇంతకు ముందు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి అతి చిన్న బ్యాగ్ తయారు చేశాడు. ఆ బ్యాగ్ కంటే కూడా చిన్న బ్యాగ్‌ను ఇప్పుడు ఇక్బాల్ సక్కా తయారు చేశాడు. అయితే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను మించి మరో ప్రత్యేకత ఈ బ్యాగ్‌కు ఉంది. అదేంటంటే.. ఈ బ్యాగ్ ధరతో ఏకంగా ఓ బీఎండబ్ల్యూ కారునే కొనుగోలు చేయొచ్చు.
మరి ఈ బ్యాగ్ ధర, దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలంటే..ఈ కథనం చదవాల్సిందే..! ఈ బ్యాగ్‌ని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో ఇక్బాల్ సక్కా తయారు చేశాడు.
ఈ బ్యాగ్ పొడవు విషయానికి వస్తే…ఇది కేవలం 0.02 అంగుళాలు మాత్రమే ఉంది. అంటే ఈ బ్యాగ్ చక్కెర స్పటిక కంటే చిన్నదిగా ఉంటుందన్నమాట. ఈ బ్యాగ్ న్యూయార్క్‌లో తయారు చేసిన ప్రపంచంలోనే అతి చిన్న బ్యాగ్ కంటే కూడా చిన్నది.
ఈ స్పెషాలిటీ ఇలా ఉంటే..దీని ధర తెలిస్తే జడుసుకుంటారు.24 క్యారెట్ల మేలిమి బంగారంతో రూపొందించిన ఈ బ్యాగ్‌ను వేలం వేయగా..రూ. 54 లక్షలు పలికింది. ఇక్బాల్ సక్కా ఈ బ్యాగును కేవలం మూడు రోజుల్లోనే తయారు చేయడం మరో విశేషం.
అయితే, దీన్ని తయారు చేస్తున్నప్పుడు ఇక్బాల్ సక్కాన తన కంటి చూపును కూడా కోల్పోయాడు.ఇంత చిన్న బ్యాగ్‌ను తయారు చేయడం అంటే చాలా రిస్క్ తో కూడిన పని.
కళ్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దాంతో ఇక్బాల్ కంటి చూపు మందగించింది.బ్యాగ్‌ను పూర్తిగా తయారు చేయడానికి చాలా శ్రమపడ్డానని, కళ్లలో భరించలేని నొప్పి వచ్చిందని ఇక్బాల్ చెప్పాడు.
అయితే, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చూపించుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొందాడు.అయితే, ఇలాంటి కళాఖండాలు తయారు చేయడం ఇక్బాల్ సక్కాకు కొత్తేమీ కాదు. అతని పేరిట 100 కంటే ఎక్కువ ప్రపంచ రికార్డ్స్ ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఫీట్లు ఇక్బాల్ సక్కా చేశాడు.
ప్రపంచంలోని అతి తక్కువ సమయంలో చిన్న చిన్న వస్తువులను తయారు చేసే వ్యక్తులలో సక్కాకూ ఒకరు. రికార్డ్స్ నెలకొల్పడంతో తనకు తానే పోటీగా నిలుస్తున్నాడు.