టీమిండియా లెజెండ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ(virat kohli) బంగ్లాదేశ్‌పై చేసిన శతకంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెంచరీ కోసం జట్టు ప్రయోజనాలను కాదని కోహ్లీ నెమ్మదిగా ఆడాడని కొందరంటే.. మరికొందరు మాత్రం ప్రశంసిస్తున్నారు. తాజాగా వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా(chatheshwar pujaaraa) కోహ్లీ సెంచరీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో’తో పుజారా మాట్లాడుతూ.. ‘కోహ్లీ సెంచరీ చేయాలని కోరుకున్న వారిలో నేనూ ఒకడిని. అయితే, ఇక్కడ గేమ్‌ను ఎంత త్వరగా ముగించాం అన్నది ముఖ్యం. ఎందుకంటే, జట్టు అగ్రస్థానానికి చేరుకోవాలంటే నెట్ రన్‌రేట్ చాలా ముఖ్యం. ఇది మనసులో పెట్టుకోవాలి. నువ్వా స్థానంలో ఉన్నప్పుడు నెట్ రన్‌రేట్ గురించే పోరాడాలి. అప్పుడిక వెనక్కి తిరిగి చూసుకునే పనే ఉండదు’ అని చెప్పుకొచ్చాడు.
కోహ్లీ అయినా, ఇతర ఆటగాళ్లు అయినా జట్టుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు. వ్యక్తిగత మైలు రాళ్లకు జట్టు బలికాకూడదని అన్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే తర్వాతి మ్యాచ్‌కు ఇక తమకు ఢోకా ఉండదని ఆటగాళ్లు భావిస్తున్నారని విమర్శించాడు. ఈ ఆలోచనా ధోరణి మారాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ సెంచరీపై ఆస్ట్రేలియా లెజెండ్ మ్యాథ్యూ హెడెన్ కూడా స్పందించాడు. ‘సెంచరీ సాధించే హక్కును కోహ్లీ సంపాదించాడు.. ఇలాంటి టర్నీలలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి ముఖ్యమైన విషయాలుగా మారుతాయని ఇయాన్ బిషప్ ఎప్పుడూ చెబుతుంటారు. అయితే, క్రీజులో ఉన్న వారిద్దరూ తీసుకున్న నిర్ణయంతో తనకు ఎలాంటి సమస్యా లేదు’ అంటూ కోహ్లీని వెనకేసుకొచ్చాడు.