Telugu News » Tirumala: తిరుమల నడక మార్గంలో మరో చిరుత!

Tirumala: తిరుమల నడక మార్గంలో మరో చిరుత!

అటవీశాఖ ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.. బోన్లు తీసుకొచ్చి జూన్ నుంచి ఇప్పటి వరకు నాలుగు చిరుతల్ని బంధించారు.

by Sai
another leopard spotted in alipiri walkway to tirumala

తిరుమల (Tirumala) నడక దారిలో మరో చిరుత (Chirutha) కనిపించిందన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. అలిపిరి (alipiri) కాలినడక మార్గంలో లక్ష్మీనరసింహ ఆలయం దగ్గర చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. చిరుత సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. ఈ చిరుతను కూడా పట్టుకునేందకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు.

another leopard spotted in alipiri walkway to tirumala

అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం సంగతి తెలిసిందే. జూన్‌లో ఓ బాలుడిపై చిరుత దాడి చేయగా.. ఆస్పత్రిలో కోలుకున్నాడు.. కొద్ది రోజులకే ఓ చిరుత దొరికింది. ఆ తర్వాత ఆగస్టు 11న నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన చిన్నారి లక్షితను లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత లాక్కెళ్లి చంపిన ఘటన కలకలంరేపింది. ఆ వెంటనే టీటీడీ అధికారులు, అటవీశాఖ ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.. బోన్లు తీసుకొచ్చి జూన్ నుంచి ఇప్పటి వరకు నాలుగు చిరుతల్ని బంధించారు. వాటిని తిరుపతిలోని జూకు తరలించారు.

నాలుగు చిరుతల్ని బంధించడంతో ఇక చిరుతల బెడద తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే ట్రాప్ కెమెరాలోను ఆ ప్రాంతాల్లోనే ఉంచారు. తాజాగా మరో చిరుత సంచారం కెమెరాల్లో రికార్డు కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.. దానిని కూడా బంధించే పనిలో ఉన్నారు. అలాగే భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది సూచిస్తున్నారు. త్వరలోనే ఆ చిరుతను కూడా పట్టుకుంటామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

చిరుత మాత్రమే కాదు ఇటీవల ఓ ఎలుగుబంటి కూడా నడక మార్గాల్లో సంచరిస్తోంది.. దీంతో ఆ ఎలుగును పట్టుకునేందుకు ప్రయత్నించారు.. కానీ అది తప్పించుకుని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.. దానిని కూడా పట్టుకునే పనిలో ఉన్నారు. అయితే గతంలోనే అటవీశాఖ అధికారులు నడక మార్గంలో ఐదు చిరుతలు సంచరిస్తున్నాయని అనుమానించారు.. ఇప్పుడు అదే నిజమైంది.

You may also like

Leave a Comment