కాంగ్రెస్ పార్టీ(Congress Party) తెలంగాణలో ప్రభుత్వం(Telangana Government) ఏర్పాటు చేశాక భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ యంత్రాంగంలో పలు కీలక మార్పులను చేస్తోంది.
ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారులను కాంగ్రెస్ సర్కార్ బదిలీ చేసింది. ఇందులో భాగంగా కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారులను బదిలీలు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నూతన సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా రాచకొండ సీపీగా సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి నియమితులయ్యారు. హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యాను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ చౌహనన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు టీఎస్పీఎస్సీ(TSPSC) చైర్మన్ జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.