వర్షాల కారణంగా రాష్ట్రమంతా ఇబ్బంది పడుతోంది. భారీ వానలకు ముఖ్యంగా హైదరాబాద్ అల్లాడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోకి వచ్చి చేరుతున్న మురుగు నీరు కారణంగా పాములు, తేళ్లు, ఇతర కీటకాలు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
ఇటు జీహెచ్ఎంసీ కంప్లైంట్ బాక్స్ నిండిపోతోంది. అయితే.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆల్వాల్ కు చెందిన సంపత్ కుమార్ అనే యువకుడు విసిగిపోయి కాస్త వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు. తమ ఇళ్లల్లోకి పాములొస్తున్నాయని ఫిర్యాదు చేసినా కార్పొరేషన్ సిబ్బంది పట్టించుకోలేదని యమా సీరియస్ అయ్యాడు.
తన ఇంట్లోకి వచ్చిన పాముతో పాటు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లాడు సంపత్. దాన్ని టేబుల్ మీద పెట్టి తమ సమస్య తీరుస్తారా.. చస్తారా? అని కూర్చున్నాడు. సంపత్ షాక్ లోంచి తేరుకున్న సిబ్బందికి.. అతని దురుసుతనానికి ఆవేశ పడాలో.. పామును పట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. నగరంలోని చాలా ప్రాంతాలు నీళ్లలో మగ్గుతున్నాయి. అస్తవ్యస్థంగా ఉన్న డ్రైనేజీతో వరద నీరు ముందుకు కదలడం లేదు. వాన నీటికి పాములు, ఇతర కీటకాలు ఇళ్లలోకి చేరుతున్నాయి.