తమకు ఆకలి పంచి..పాక్ అన్నం తీసుకుపోతుందని పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ప్రజలు ఆందోళనకు దిగారు.పుష్కలమైన ఇక్కడ వనరులను దోచుకుంటూ పాకిస్థాన్ తమ జీవించే హక్కును శాసిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా పాకిస్థాన్(Pakistan)కు వ్యతిరేకంగా పీఓకే ప్రజలు చేస్తున్న ఆందోళనలను పాక్ పాలకులు ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. అనధికార విద్యుత్ కోతలతో పీఓకేలో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
చాలా ప్రదేశాల్లో రోజుకు కొన్ని గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తుండటం.. వీరి బతుకులను అంధకారం వైపు నడిపిస్తోంది. పాకిస్థాన్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే పీఓకేలో అత్యధిక విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నారు.
పీఓకే(PoK)లో 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగితే.. అందులో తాము బతకడానికి కనీసం 400 మెగావాట్ల విద్యుత్ అయినా కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
నదులు, సరస్సుల వంటి సహజ వనరులు(Natural resources)పీఓకేలో సమృద్ధిగా ఉన్న…సురక్షిత తాగునీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
ఆయా నదులపై నీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించాలని పౌరులు నినదిస్తున్నా వినే నాథుడే లేకుండా పోయాడు.ముజఫరాబాద్(Muzaffarabad)డివిజన్లోని నీలం- జీలం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
మిర్పుర్ డివిజన్లోని రతోవ భారీ హర్యామ్ వంతెనను పునరుద్ధరిస్తే మిగిలిన భూభాగంతో సంబంధాలు పెరిగి కష్టాలు తీరుతాయని చెబుతున్నా.. ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీఓకేలోని స్థానిక యంత్రాంగాలు పాక్ ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మల్లా తయారయ్యాయి. గోధుమ పిండి కొరత నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం.. ప్రజలను పస్తులు ఉంచుతోంది.
గోధుమల దిగుమతిపైనా అధిక పన్నులు విధిస్తున్నారు.గిల్గిట్(Gilgit), బాల్టిస్థాన్, పర్యటకానికి ప్రసిద్ధి. అలాంటి ప్రదేశాల్లో పారిశుద్ధ పనులు చేపట్టకపోవడం వల్ల ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.