ఇటీవల తరచూ గుండెనొప్పి మరణాలు(Heart attacks) చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువత సహా మధ్యవయసు వారిలో ఈ తరహా మరణాలు చోటుచేసుకోవడం బాధాకరం. తాజాగా కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర( Vijay Raghavendra) భార్య స్పందన(Spandana) గుండెనొప్పితో హఠాన్మరణం చెందారు. దీంతో నటుడు విజయ్ ఇంట విషాదం అలముకుంది.
ఆమె అకాల మరణం తమను తీవ్రంగా కలచివేస్తోందంటూ విజయ్ సన్నిహితులు సోషల్ మీడియాలో వారి వారి ఆవేదనను తెలియచేస్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్య మంత్రి సైతం విజయ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.స్పందనతో నటుడు విజయ్ కి 2007 లో వివాహమైంది. ఈమె బెంగుళూరుకి చెందిన పోలీస్ అధికారి బీకే శివరామ్ కుమార్తె. స్పందన,విజయ్ దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు.
2016 లో ఆమె ‘అపూర్వ’ అనే కన్నడ సినిమాలో కూడా నటించారు. ఇటీవల స్నేహితులతో కలిసి టూర్ కి వెళ్లిన ఆమె సోమవారం ఉదయం గుండెనొప్పిగా ఉందని స్నేహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఆస్పత్రి తరలించేలోపే స్పందన కన్ను మూసినట్టు తెలుస్తోంది. కాగా తీవ్రంగా కలచివేసే మరో విషయం ఏంటంటే రానున్న 19 రోజుల్లో విజయ్ దంపతుల వివాహ వార్షికోత్సవం కూడా ఉంది. ఇంతలో ఇలా జరగడం దురదృష్టకరమని కుటుంబ సభ్యులు తీవ్రఆవేదనకు గురవుతున్నారు.