బస్తీ దవాఖానాలకు నిధులిస్తున్నది ప్రధాని మోడీనే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. బాగ్ అంబర్ పేట్ మల్లికార్జున నగర్ బస్తీలో కిషన్రెడ్డి(Kishan Reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ చేపట్టే ప్రయోజనాలను వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.
అనంతరం శివంరోడ్లో సత్యసాయి సేవా సంస్థ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కిషన్రెడ్డి ప్రారంభించారు. అక్కడి నుంచి అమీర్ పేట్ కీర్తి అపార్ట్మెంట్స్ వాసులతో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశంలో ప్రజలతో మాట్లాడారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులను విడుదల చేస్తున్నా వాటిని గత ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో 13కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం కేంద్రం ఇచ్చిన నిధులతోనే నిర్మించామన్నారు. దేశంలో 4కోట్ల ఇళ్లను కట్టించినట్లు తెలిపారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ కారణంగా ఇళ్లు కట్టలేదని తెలిపారు. రేషన్ కార్డ్ ఉన్న పేదలకు అందరికి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నామన్నారు. కరోనా సమయంలో పేదలను ఆదుకున్నారని తెలిపారు. పేదల ప్రాణాలను కాపాడటానికి ఉచిత వ్యాక్సిన్ ఇచ్చామన్నారు.
పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదుల వంటి సౌకర్యాలను కల్పిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని తెలిపారు. గాంధీ, ఈఎస్ఐ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు మంజూరు చేశామని అది పూర్తయితే హైదరాబాద్ మరింత విస్తరిస్తుందన్నారు. అంబర్ పేట్ బిడ్డగా ఎమ్మెల్యేగా తనను మూడుసార్లు గెలిపించారని గుర్తుచేశారు. బిడ్డగా ఆదరిస్తారని మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 13 తేదీన కమలం గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు.