కోలీవుడ్ నటుడు(Actor) మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan) అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వేలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి మన్సూర్ అలీ ఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో వేలూరులో విస్తృతంగా ప్రచారం (Election Campaign) చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనకు ఛాతిలో నొప్పి (Chest Pain) రావటంతో పక్కనే ఉన్న వలంటీర్లు గుడియాత్తంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత చెన్నై కేకేనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.మన్సూర్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యపరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మన్సూర్ సంచలన ఆరోపణలు చేశాడు.
తనకు పండ్లరసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని మస్సూర్ అలీఖాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందులో గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు దారిలో కొందరు పండ్లరసం, మజ్జిగ ఇచ్చారన్నారు. పండ్లరసం తాగిన కొద్ది నిమిషాలకే కళ్లు తిరిగి గుండెల్లో నొప్పి వచ్చిందన్నారు. ఆస్పత్రిలో చేరుకున్నాక కోలుకున్నానని చెప్పారు.
పలు భాషల్లో నటించిన మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ప్రముఖ నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆయన ‘డెమోక్రటిక్ టైగర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పార్టీని ప్రారంభించారు. అయితే పార్టీకి ఇంకా ఎన్నికల సంఘం గుర్తింపు రాకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.