ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తామని చెబుతోన్న కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని అనుకొంటున్నారు. ప్రభుత్వం తీసుకొంటున్న కొన్ని నిర్ణయాల పట్ల రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతోన్న ఘటనలు కనిపిస్తుండగా.. తాజాగా మరో సమస్య వచ్చిపడింది.. ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు నిరసనకు దిగారు.
తమకు చెల్లించ వలసిన పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు, మెస్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. కాగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున కార్మికులు తరలిరావడం ఇబ్బందికరంగా మారిందని అనుకొంటున్నారు.. మరోవైపు ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు.
తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్ వద్ద బారులు తీరారు. ఈమేరకు ప్రజల నుంచి అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలిస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్ళి.. పరిష్కారం దొరికేలా ప్రజావాణి నిర్వహిస్తున్నారు..