అనారోగ్యం కారణంగా ప్రముఖ నటుడు సాయాజీ షిండే (Sayaji Shinde) కొన్నిరోజుల కిందట ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆయన స్పందించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రేక్షకులను అలరించేందుకు త్వరలోనే తిరిగి వస్తానని చెప్పారు.
దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. ‘గెట్ వెల్ సూన్’ అంటూ కామెంట్స్ పెట్టారు. సాయాజీ షిండే ఈ నెల 11న ఛాతీ నొప్పితో ఇబ్బందిపడ్డారు. కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్ర(Maharashtra)లోని సతారాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పలు పరీక్షల అనంతరం గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారని, ఈసీజీలో స్వల్ప మార్పులు గుర్తించామని వైద్యులు వెల్లడించారు.
యాంజియోగ్రఫీ అనంతరం గుండెలో కుడివైపు 99 శాతం బ్లాక్స్ గుర్తించాం. తీవ్రత దృష్ట్యా వెంటనే యాంజియోప్లాస్టీ చేశామని అని వైద్యులు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే నటుడిగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు ఆయన. ‘ఠాగూర్’ సినిమాలో విలన్‌గా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
టాలీవుడ్లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో విలన్, సహాయ నటుడిగా, తండ్రి పాత్రలు పోషించారు. ఆయన నటించిన సినిమాల్లో ముఖ్యంగా నేనింతే, గుడుంబా శంకర్, సూపర్, ఆంధ్రుడు, అతడు, రాఖీ, దుబాయ్ శీను, కింగ్ అదుర్స్ సినిమాలతో మంచిపేరు తెచ్చుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఆయన తెలుగు నేర్చుకుని మరీ టాలీవుడ్లో రాణించడం విశేషం.