Telugu News » Telangana : తెలంగాణలో అడుగంటుతున్న గ్రౌండ్ లెవల్ వాటర్.. నీళ్లకు తిప్పలు తప్పవా..?

Telangana : తెలంగాణలో అడుగంటుతున్న గ్రౌండ్ లెవల్ వాటర్.. నీళ్లకు తిప్పలు తప్పవా..?

రాష్ట్ర సర్కారు తాగునీటి అవసరాల దృష్ట్యా ఖరీఫ్​ నుంచే సాగర్​ ఆయకట్టు కింద క్రాఫ్​ హాలీడే ప్రకటించింది. కానీ సాగర్​ ఆయకట్టు కింద బోర్లపై ఆధారపడి పంటలు సాగుచేసిన రైతులు భూగర్భజలాలు అడుగంటడంతో పంటలను చాలాచోట్ల పశువుల మేతగా వదిలేస్తున్నారు.

by Venu

తెలంగాణ (Telangana)లో సాగునీటి సంగతేమోగానీ.. ప్రస్తుతం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల్లో డేంజర్​ బెల్స్​ మోగుతున్నాయి. రాష్ట్రంలో నిరుడు అక్టోబర్​ నుంచి 54 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, సూపర్​ ఎల్​నినో ఎఫెక్ట్​తో మార్చిలోనే ఎండలు మండిపోతుండటంతో ప్రధాన జలాశయాల్లోని వాటర్ ​లెవల్స్​ (Water Levels) వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ జనవరి నుంచే గ్రౌండ్​వాటర్​ లెవల్స్​ పడిపోతున్నట్టు భూగర్భ జలవనరుల శాఖ తేల్చింది. జనవరిలో సగటు నీటిమట్టం 6.22 మీటర్లు కాగా.. ఇప్పటికే 7.72 మీటర్ల లోతుకు పడిపోయాయి. నిజామాబాద్‌‌ (Nizamabad) జిల్లా గోనుగుప్పులలో ఏకంగా 27.63 మీటర్ల లోతుకు పడిపోయాయి. ముఖ్యంగా ఎల్లంపల్లి నీటిమట్టం​ తగ్గడంతో హైదరాబాద్​ (Hyderabad) మెట్రో వాటర్​స్కీం​కు తిప్పలు తప్పేలా లేవన్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా కృష్ణా బెల్ట్​లో ఈ వానకాలం తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్​ ప్రాజెక్టులు డెడ్​స్టోరేజీకి చేరాయి. ప్రస్తుతం జూరాలలో 4 టీఎంసీలు, శ్రీశైలంలో 36.40 టీఎంసీలు, సాగర్​లో 140 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. నాగార్జున సాగర్ డెడ్​స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515 అడుగుల నీరు మాత్రమే ఉంది. గత మార్చి7న ఈ ప్రాజెక్టులో 17.51 టీఎంసీల నీరుండగా, తాజాగా 10 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్​కు 320 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు తరలిస్తున్నారు.

మరోవైపు రాష్ట్ర సర్కారు తాగునీటి అవసరాల దృష్ట్యా ఖరీఫ్​ నుంచే సాగర్​ ఆయకట్టు కింద క్రాఫ్​ హాలీడే ప్రకటించింది. కానీ సాగర్​ ఆయకట్టు కింద బోర్లపై ఆధారపడి పంటలు సాగుచేసిన రైతులు భూగర్భజలాలు అడుగంటడంతో పంటలను చాలాచోట్ల పశువుల మేతగా వదిలేస్తున్నారు. ఇక గత సంవత్సరం అక్టోబర్​ నుంచి సగటు వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రాజెక్టుల్లో నీళ్లు తగ్గుతూ రావడం, చెరువులు ఎండిపోవడంతో రైతులు తమ పంటలు కాపాడు కునేందుకు బోర్లపై ఆధారపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే తాగునీటి గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక సర్కారు సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment