హంతకులకు పాలించే హక్కులేదని, వంచన చేసిన పార్టీకి ఓటు వేయొద్దంటూ వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) కుమార్తె సునీతారెడ్డి(Sunitha Reddy) ప్రజలను కోరారు. తన తండ్రి హత్యా ఉదంతంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ(Delhi)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన తండ్రి 2019 మార్చి 14-15 రాత్రి హత్యకు గురయ్యారని, తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తండ్రిని సొంత వాళ్లే మోసం చేసి ఓడించారని ఆరోపించారు. ఓటమి పాలైన తన తండ్రిని మరింత అణచాలని చూశారన్నారు. హత్య తర్వాత మార్చురీ వద్ద అవినాష్ తనతో మాట్లాడారని, పెదనాన్న రాత్రి 11.30 గంటల వరకు నా కోసం ప్రచారం చేసినట్లు చెప్పారని గుర్తు చేశారు. అలా ఎందుకు చెప్పారో అప్పుడు అర్థం కాలేదన్నారు. ఒక్కో సారి హంతకులు మన మధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందన్నారు.
సీబీఐ విచారణకు వెళ్దామని జగన్ను అడిగితే.. అలా చేస్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తారని అన్నారని తెలిపారు. ఈ కేసులో అరెస్ట్, ఛార్జిషీటుకు ఏడాది సమయం పట్టిందన్నారు. కేసు దర్యాప్తు ఎందుకంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు. సీబీఐపైనా కేసులు పెట్టడం మొదలుపెట్టారని, దర్యాప్తు అధికారులనూ భయపెట్టారని సునీతా వాపోయారు.
విలువలు, విశ్వసనీయత, మాట తప్పను మడమ తిప్పను అని సీఎం జగన్ పదేపదే అంటుంటారని.. మరి వివేకా హత్య కేసులో ఆ మాట ఏమైందని ప్రశ్నించారు. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సీబీఐ విచారణలో నిందితులుగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని కచ్చితంగా వాళ్లను జగన్ రక్షిస్తున్నారన్నారు. జగన్ పాత్ర ఉన్నదీ లేనిదీ తాను చెప్పకూడదని, సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.