Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ (Davos)లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) బృందం పర్యటిస్తోంది. ఇందులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) ప్రెసిడెంట్ బ్రెండి బోర్గ్, ఇథియోఫియా ఉపప్రధాని మేకొనెన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. మరోవైపు ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై రేపు జరగనున్న చర్చాగోష్టిలో ప్రసంగిస్తారు.
భారత్ (India)కు చెందిన టాటా, విప్రో, హెచ్ సీఎల్ టెక్, జేఎస్ డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో పాటు సీఐఐ, నాస్కం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో జరిగే చర్చల్లో నేడు, రేపు.. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్టు సమాచారం. అంతే కాకుండా నొవర్తీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజెనెకా, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను సీఎం కలువనున్నారు.
వైద్యారోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రజల హెల్త్ డేటా రూపొందించే అంశంపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డితో పాటు యురోపియన్ ఆరోగ్య కమిషన్, ఆహార కమిషనర్, జెనీవా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ హెల్త్ హెడ్, ఆక్సియోస్ చీఫ్ ఎడిటర్, రువాండ ఐటీ మంత్రి, మయో క్లినిక్ సీఈవో, టకేడా ఫార్మా కంపెనీ సీఈవో పాల్గొంటారు.
సదస్సు కోసం దావోస్ వచ్చిన వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు, సీఈవోలతో సీఎం బృందం చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఈ విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సహ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.. ఈ సదస్సు ముగిసిన అనంతరం18వ తేదిన జూరిచ్ నుంచి లండన్ వెళ్తారు. అక్కడి నుంచి 20వ తేదిన దుబాయ్ మీదుగా బయలుదేరి.. 21న ఉదయం 8:25 నిమిషాలకు ఈ బృందం హైదరాబాద్ చేరుకోనున్నట్టు సమాచారం..
మరిన్ని తెలంగాణ వార్తలు మరియు తెలుగు న్యూస్ కోసమై ఇవి చదవండి…!