తెలంగాణలో అకాల వర్షాలు(Sudden rains) రాష్ట్ర ప్రజానీకాన్ని ఆగమాగం చేస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది.ఈదురుగాలుల ధాటికి ఓ చిన్నారి, పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వడగళ్ల వానలకు సిద్ధిపేట(Siddipet)లో పంటలు (Crop loss) తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అన్నదాతలు(farmers) తలలు పట్టుకుంటున్నారు.
మంగళవారం వీచిన ఈదురుగాలుల మూలనా మెదక్ జిల్లాలో ఊయలలో ఆడుతున్న చిన్నారి ఎగిరి పక్కనే ఉన్న డాబాపై పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజితండాలకు చెందిన మాలోత్ మాన్ సింగ్, మంజుల దంపతులకు సీత, గీత అనే కవలలు ఉన్నారు. దంపతులు కూలి పనులకు వెళ్లగా పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉన్నారు.
నిన్న బలమైన ఈదురు గాలులు వీచడంతో ఇంటి పైకప్పు ఒక్కసారిగా లేచిపోయింది. ఇంట్లో చీరకట్టులో ఆడుకుంటున్న సీత(5) కూడా రేకులతో పాటు ఎగిరి 20 మీటర్ల దూరంలో ఉన్న మరో డాబా ఇంటిపై పడింది. చిన్నారికి తీవ్రగాయాలు అవ్వగా కుటుంబసభ్యులు వెంటనే నర్సాపూర్ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సీత మృతి చెందడంతో ఫ్యామిలీ మెంబర్స్ కన్నీరుమున్నీరయ్యారు.
మరోవైపు పదోతరగతి పరీక్షకు హాజరైన ఎం వెంకటేశ్ (16) సైతం మృతి చెందినట్లు సమాచారం. జిల్లాలో సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షాలకు వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మామిడి, కూరగాయాలు తదితర పంటలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. పలుచోట్ల విద్యుత్ స్థంభాలు నెలకొరిగాయి. ఈ పరిస్థితిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫోన్ లో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే రూ.10 వేలు తక్షణ సాయంగా అందించాలని డిమాండ్ చేశారు.