బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh) తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ తెలంగాణ (Telangana)లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఇటీవల శ్రీరామ నవమి (Srirama Navami)శోభాయాత్రలో భాగంగా అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఐదు రోజులు కూడా గడవకముందే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది.
ఈసారి కూడా శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. సుల్తాన్ బజార్ ఎస్ఐ ఫిర్యాదు మేరకు అదే పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజాసింగ్ హనుమాన్ వ్యాయామశాల వద్ద మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎస్ఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనుమతి లేకున్నా రాజాసింగ్ శోభయాత్ర నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని సుమోటోగా తీసుకున్న పోలీసులు రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఐపీసీ 188, 290 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుల్తానా బజార్ పోలీస్ స్టేషన్లో ఈనెల 18వ తేదీనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
పలుమార్లు శోభాయాత్రను నిలిపి బాణసంచా కాలుస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా హనుమాన్ శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలు పలు వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, రాజాసింగ్‌పై కేసు నమోదు చేయడంపై ఆయన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.