ఇజ్రాయెల్‌పై ఇరాన్ గత శనివారం భారీ సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ (Israel) ప్రకటించింది. కాగా తాజాగా అన్నంత పనీ చేసింది. ఇరాన్ (Iran)పై ప్రతీకార దాడి చేసింది. సంయమనం పాటించాలన్న ఐక్యరాజ్యసమితి, అమెరికా మాటలను పెడచెవిన పెట్టింది..
ఇరాన్‌పై ఇజ్రాయెల్ నిన్న తెల్లవారు జామున క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా సీనియర్ అధికారి వెల్లడించారు. మరోవైపు అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా సైతం పేర్కొంది. కానీ మీడియా కథనాలను స్థానిక ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివేసింది.
టెహ్రాన్ (Tehran), ఇస్ఫాహాన్ (Isfahan), షిరాజ్ (Shiraz) నగరాల మీదుగా వెళ్లే వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడానికి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది..
ఇక ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని కాన్సులేట్ కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావించిన ఇరాన్ ఇటీవలే ప్రతీకార దాడికి దిగింది.. ఇరాన్ దాడులను వ్యూహాత్మకంగా తిప్పికొట్టామని ఆర్మీ అధికార ప్రతినిధి డానియెల్ హగేరీ పేర్కొన్నారు. ఇరాన్ తమ భూభాగంపైకి 170 డ్రోన్లు, 30కి పైగా క్రూయిజ్ క్షిపణులు, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని తెలిపారు.