బెంగళూరు(Bangalore) లోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు(Rameswaram Cafe Blast Case)ను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. కేఫ్ పేలుడు కేసులో భాగంగా బెంగళూరులో పోలీసు దర్యాప్తు బృందాలు నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు సీసీ ఫుటేజీలను సేకరించారు.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల జరిగిన ప్రమాదంగా పోలీసులు భావించారు. అయితే ఘటనాస్థలిలో ఓ హ్యాండ్ బ్యాగ్ పేలినట్లు కనిపించడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలంలో ఆధారాల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది.
శనివారమే కేఫ్‌లో ఉన్న డిజిటల్ వీడియో రికార్డర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు టోపీ, కళ్లజోడు ధరించి కర్చీఫ్‌తో ముఖాన్ని కవర్ చేసుకొన్నట్లు గుర్తించారు. అనుమానితుడు కేఫ్ సమీపంలో రూట్ నంబర్ 500-డి బస్సు దిగినట్లు నిర్ధారించారు. పేలుడుకు దాదాపు గంట ముందు అతడి కదలికలను పోలీసులు గుర్తించారు.
తాజాగా నిందితుడిని పోలీసులు గుర్తించారని, అతడి వయస్సు 28 నుంచి 30 మధ్యలో ఉంటుందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామన్నారు. శివమొగ్గ, మంగళూరు పేలుళ్లకు దీనికి సంబంధం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర చెప్పారు.