ఓటమి మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తుందని అంటారు.. కానీ కేసీఆర్ విషయంలో మాత్రం రివర్స్ అయ్యిందని అంటున్నారు.. ఫామ్ హౌజ్, ప్రగతి భవన్ తప్ప వేరేలోకం తెలియని ఆయనను ప్రజల మధ్యకు వెళ్ళేలా చేసిందని.. జనం ఎంత మాట్లాడిన మౌనంగా వినడం నేర్పిందని చర్చించుకొంటున్నారు.. అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాటే శాసనంగా ఉండేది. ఎవరైనా నోరు విప్పితే నీకేం తెల్వదు నోరు మూసుకూర్చో అని దబాయించిన ఘటనలు కోకొల్లలు..
కానీ రాజకీయ నేతలకు ఎన్నికలు రాగానే జనం అయినవారు అవడం కామన్ మ్యాటర్.. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) సందర్భంగా కేసీఆర్ (KCR) ప్రచారంలోకి దిగారు. యాతనతో కూడిన ఈ యాత్ర కూలిపోతున్న ఆశలను నిలబెట్టుకోవడానికి.. వాడిపోతున్న గులాబీని చిగురింపచేయడానికని తెలిసిందే. నేడు ఆయన.. తెలంగాణ (Telangana) భవన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు..
తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, మహిళల హారతులు అందుకొని, కార్యకర్తల బాణాసంచా హడావిడి మధ్య పార్టీ భవిష్యత్తును ఊహించుకొంటూ.. కేసీఆర్ బస్సు ఎక్కారు. ఇక యాత్ర నేటి నుంచి మే 10 వరకు జరుగుతుందని సమాచారం.. ఇందులో భాగంగా మొదటి సభ మిర్యాలగూడ (Miryalaguda)లో నిర్వహిస్తుండగా.. చివరి సభ సిద్దిపేట (Siddipet)లో జరగనుంది..
అయితే ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా.. అందులో భానుడి భగ భగలవల్ల కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే తిరగాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు నుంచి సమాచారం.. మరోవైపు లోన ఎంత నొప్పి ఉన్న బయటికి మాత్రం గాంభీర్యాన్ని ప్రదర్శించడం ఆయనకి వెన్నెతో పెట్టిన విద్య.. అందుకే లోన ఉన్న వేదన ముఖంపై కనిపించనీయకుండా పార్లమెంట్ ఎన్నికలలో తమ పార్టీ పదికి పైగానే స్థానాలు గెలుస్తుందనే పదాలు వినిపిస్తున్నాయి..
కానీ ఒక్క మెదక్ స్థానంలో తప్ప ఎక్కడా గెలిచే అవకాశాలు లేవని ఏరకంగా చూసిన క్లియర్గా కట్ గా అర్థమవుతోందని అంటున్నారు.. అదికూడా రేవంత్ రెడ్డి ఏదైనా మ్యాజిక్ చేస్తే లెక్కలు తారుమారవుతాయనే వాదన వినిపిస్తోంది. మరోవైపు శుభమా అని కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభిస్తే ఆయన కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది.. ఒక్కసారిగా ముందు ఉన్న కారు ఆగడంతో వెనక ఉన్న కార్లు వరుసగా ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దాదాపు ఐదు కార్లు ముందు భాగాలు ద్వంసం అయినట్లు సమాచారం..