తెలంగాణ(Telangana)లో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన(Praja Palana) కార్యక్రమంలో ‘ఆరు గ్యారంటీ’లతో పాటు కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అయితే తాజాగా కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
పాత పద్ధతిలోనే స్థానిక మీసేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. ఈ దరఖాస్తుల కోసం నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ద్వారా ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా తెలంగాణ సర్కార్ సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరి నెలాఖరు నాటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించింది.
ఇక, ప్రజాపాలనలో మొత్తం 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అయితే వీటిలో కొత్త రేషన్ కార్డులు, భూ వివాదాలకు సంబంధించిన దరఖాస్తులు దాదాపు 20 లక్షలకు పైగానే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 90లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2.8కోట్ల మందికిపైగా లబ్ధి పొందుతున్నారు.
అయితే ఇంకా 20లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడంతో పాత పద్ధతిలోనే స్థానిక మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వీలైనంత త్వరగా రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన వారికి అందజేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 80 శాతానికిపైగా ఈ ప్రక్రియ పూర్తి కాగా జనవరి 31 వరకు ఈ-కేవైసీకి గడువు విధించారు.