క్రికెట్.. ఇది ఒక ఆట మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. టీమిండియా(Team India) ఆటతీరుకు ప్రపంచ దేశాలు సైతం ఫిదా అవ్వాల్సిందే. దేశంలో ప్రస్తుతం వరల్డ్ కప్ ఫైనల్(World Cup Final) ఫీవర్ నడుస్తోంది. ప్రపంచ కప్ టోర్నీ మొదలు నుంచి భారత్ రికార్డులు అన్నీ ఇన్నీ కావు. పాత రికార్డులన్నింటినీ కూకటివేళ్లతో పెకిలించింది.
ఫైనల్ మ్యాచ్‌కు సునాయాసంగా చేరుకుంది. ఆస్ట్రేలియాతో పోరుకు ఇంకా కొద్ది నిమిషాలే మిగులుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా టీమిండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఫ్యాన్స్ హడావుడి సర్వసాధారణం. కానీ ఈ మ్యాచ్ భారత్‌కు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది.
అందుకు అహ్మదాబాద్‌కు ఫ్యాన్స్ క్యూకట్టడంతో ఏకంగా టికెట్ల ధరలనే వేలకు వేలు పెంచేశారంటే ఈ మ్యాచ్‌కు ఎంతటి ప్రధాన్యత సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఫైనల్‌లో భారత్ గెలవాలని దేశమంతా ముక్త కంఠంతో కోరుకుంటోంది. కుల మతాలకు అతీతంగా ప్రార్థనలు చేయడమే దీనికి నిదర్శనం.
తెలుగు రాష్ట్రాల ప్రజలు వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఘనవిజయం సాధించాలని పూజలు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హోమం నిర్వహించారు. ఇండియా వరల్డ్ కప్ గెలవాలని ప్రత్యేక పూజలు, హోమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏపీలో తిరుమలలోని అలిపిరి పాదాల మండం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రార్థనలు, పూజలు చేస్తూ భారత్ విజయం కోసం ఎదురుచూస్తున్నారు.