రైతే రాజు అని ఊరికే అనలేదు.. వరదలొచ్చినా, వానలొచ్చినా, కరువు కాటకాలొచ్చినా.. మనం బుక్కెడు బువ్వ తింటున్నామంటే అందుకు చెమటోడ్చి పొలంలో దుక్కి దున్ని పంట పండించే రైతన్నే కారణం.. ఈ విశాల భారతావనిలో పంటలే మనకు జీవనాధారం. అలాంటి పంటలు పండించే రైతుల రుణం ఎన్ని జన్మలొచ్చినా తీర్చుకోలేమన్నది వాస్తవం.. ఇదొక రైతు భారతావని. పచ్చని పొలంలో పండే ధాన్య రాశులు పసిడి పంటలంటే అతిశయోక్తి కాదు.
ఉదాహరణకు అసోం విషయానికే వస్తే అక్కడ ఆ రాష్ట్ర నూతన సంవత్సరంలో ఇందుకు ఆరంభ సూచనగా .. మన సంక్రాంతి లాగే పంటల తాలూకు వేడుకలు జరుపుకుంటారు. పంట ధాన్యం చేతికొచ్చిన వేళ.. అంతా రైతులను సత్కరిస్తారు. ఈ సీజన్ లోనే వేర్వేరు కాలాల్లో ‘బిహూ’ పేరిట మూడు రకాల వేడుకలు నిర్వహిస్తారు.
ఏప్రిల్ లో రొంగాలీ, అక్టోబరులో కొంగాలీ లేదా కటి బహు పేరిట, జనవరిలో భోగాలీ లేదా మాఘ్ బహు పేరిట వీటిని సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఈ సమయాల్లో రైతులను ఆహ్వానించి వారిని సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా బోడో జాతివారు సంబరంగా దీన్ని నిర్వహిస్తారు.
లాంతర్లను వెలిగించి.. పంటలు బాగా పండేట్టు చూడాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. ఇప్పటికీ ఈ సంప్రదాయం అసోంలో ఘనంగా కొనసాగుతోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ దేశంలోని 135 కోట్లమంది ప్రజలకు ఇంత అన్నం పెడుతున్న రైతన్నను సత్కరించడం మహద్భాగ్యంగా భావిస్తుంటారు. వీరిని గౌరవించడం సమాజ బాధ్యత అన్నదే బోడోల సిధ్ధాంతం.