రాజకీయ వేధింపులకు తాను బలయ్యాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మీ ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోలేనప్పుడు ఇలా ప్రాసిక్యూట్ చేసి వేధిస్తారని ఆయన అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆరోపించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న ఆయన.. 2020 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పుడు ఫలితాలను తారుమారు చేయడానికి యత్నించానన్న ఆరోపణలను తోసిపుచ్చారు. నేను నిర్దోషినని, ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర అని అన్నారు.
నిన్న వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో హాజరై ట్రంప్ తన వాంగ్మూలమిచ్చారు. జస్టిస్ డిపార్ట్మెంట్ స్పెషల్ లాయర్ జాక్ స్మిత్ నేరాభియోగాలు మోపిన రెండు రోజుల తరువాత ఆయన మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. ఈ సమయంలో జాక్ స్మిత్ కూడా కోర్టులోనే ఉన్నారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అమెరికాకు ఇది చాలా విచారకరమైన రోజని, దేశంలో ఇలా జరుగుతుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు.
తాను దోషిని కానని ఆయన ప్రకటించడం ఇది మూడోసారి. గత ఏప్రిల్ లో కూడా కోర్టులో ఆయన ఇదే మాట చెప్పారు. నాలుగు నేరాభియోగాలను పురస్కరించుకుని ఆయనను లోగడ అరెస్టు చేశారు. అయితే అన్ని ఫెడరల్ చట్టాలకు తాను కట్టుబడి ఉంటానని ఆయన హామీ ఇచ్చిన అనంతరం విడుదల చేశారు.
ఇక ట్రంప్ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 28 న జరగనుంది. ఓ పోర్న్ స్టార్ కు సంబంధించి ‘హుష్ మనీ’ కేసులోనూ, పదవి నుంచి దిగిపోయేముందు వైట్ హౌస్ నుంచి క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను చట్ట విరుద్ధంగా తన నివాసానికి తీసుకువెళ్లాడన్న కేసులో కూడా ట్రంప్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు.