సోషల్ మీడియా (Social Media)లో యాక్టివ్ గా ఉండే నటుల్లో రష్మి గౌతమ్ (Rashmi) ఒకరు. తరచూ ట్విట్టర్(ఎక్స్)లో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా సనాతన ధర్మంపై ఆమె చేసిన పోస్ట్ వైరల్ (Viral) అయింది. అంతేకాదు, కొందరు తనను టార్గెట్ చేశారు.. ఎవరి విశ్వాసాలు వారివి అంటూ గట్టిగానే కౌంటర్ ఎటాక్ చేశారు రష్మి.
జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ గతంలో సనాతన ధర్మం గొప్పతనాన్ని వివరిస్తూ మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియోని రెండు రోజుల క్రితం షేర్ చేశారు రష్మి. దీంతో ఈమెను కొందరు టార్గెట్ చేశారు. రష్మి సినిమాలు, సనాతన ధర్మం, ఇంకా అనేక అంశాలపై ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆమె.. నెటిజన్ల కామెంట్లకు ధీటుగా బదులిచ్చారు. దేవుడిని ఎందుకు నమ్మరని నేనెవరినీ అడగలేదు.. నాకు నచ్చిన ధర్మాన్ని నేను పాటిస్తాను.. మీకు వచ్చిన సమస్య ఏంటి? అంటూ ఫుల్ ఫైరయ్యారు.
వాక్ స్వాతంత్ర్యం ఉన్నంత మాత్రాన తన ఇష్టాఇష్టాలపై ఎందుకు కామెంట్ చేస్తున్నారని ప్రశ్నించారు రష్మి. కుల వివక్షపై మాట్లాడుతున్న మీరు అసలు ఏ మతం పర్ఫెక్టుగా ఉందో చెప్పగలరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఈ పోస్ట్ తర్వాత ఆమెకు మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. కొందరైతే ఆమెకు చెందిన ఫోటోలను పోస్ట్ చేసి సనాతన ధర్మం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? అని అడిగారు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. వాదనలో విషయం లేనప్పుడు ఇలాంటివి చేస్తారంటూ కామెంట్ పెట్టారు.
హిందూ మతంలో అమ్మాయిలు యుక్త వయసు రాకముందే పెళ్లి చేసుకుంటారు.. రుతు క్రమంలో స్నానం చేయరు, వంట చేయరని చెబుతారు.. దీనిపై ఏమంటారని రష్మిని అడిగితే.. పీరియడ్స్ సమయంలో స్త్రీలకు విశ్రాంతి అవసరం. అందుకే, ఇలాంటివి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల అమలు వెనుక ఓ కారణం ఉంది. తర్వాత ఇది దుర్వినియోగం చేశారు. మీలాంటి వ్యక్తులు దీనిని తిరోగమనంగా పేర్కొన్నారు అని వ్యాఖ్యానించారు రష్మి. అంతేకాదు, ప్రతి జాతిని గౌరవించాలనేది హిందూ మతం ప్రాథమిక సూత్రమని.. మీకు హిందువులతో సమస్య ఉంటే సనాతన ధర్మాన్ని ఎందుకు అవమానిస్తారని ప్రశ్నించారు. నా మతాన్ని ఎవరు అవమానించినా ఎదురు తిరిగి పోరాడతానని స్పష్టం చేశారు. మనిషి తీసుకునే నిర్ణయాలతో నమ్మకాలను కలపవద్దని మరో ట్వీట్ లో అన్నారు రష్మి.