Featured posts
పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్(BRS) పార్టీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆ పార్టీ చూస్తోంది. ఒకవేళ ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన విధంగా సీట్లు రాకపోతే ప్రజల్లోకి చెడు సంకేతం వెళ్తుందని కేసీఆర్ ముందుగానే గుర్తించినట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రగతిభవన్ లేదా ఫాంహౌస్ ఈ రెండూ తప్ప కేసీఆర్కు ఏమీ తెలీదు.
ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కినా, ఆర్టీసీ కార్మికులు ధర్నాచౌక్ వద్ద నిరసనకు దిగినా గులాబీ బాస్ పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ధరణి పోర్టల్ వలన చాలా మంది రైతులు తమ భూమిని కోల్పోయారు. దీనిపై రైతులు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపినా ఆయన బయటకు రాలేదు.
కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేసీఆర్ (Ex Cm KCR) పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. ఆ ప్రతిపక్ష హోదాను కాపాడుకునేందుకు కేసీఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు గౌరవ ప్రద స్థానాలు దక్కకపోతే జనంలోకి తప్పుడు సంకేతం వెళ్తుతుంది. ఆ తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న సొంత పార్టీ లీడర్లు ఇతర పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతం కేసీఆర్కు అధికార పార్టీని విమర్శించడం కంటే పార్టీని కాపాడుకోవడం చాలా ముఖ్యం. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టినప్పుడు వారికి కౌంటర్ ఇచ్చేందుకు కూడా కేసీఆర్ బయటకు రాలేదు. కేటీఆర్(Ktr), హరీశ్ రావే(HarishRao) ఆ బాధ్యతను నెత్తిమీద వేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక కాలు విరిగిందనే కారణంతో ఆయన ఇంతకాలం బయటకు రాలేదు.
తాజాగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరువు ప్రాంతాల్లో గులాబీ బాస్ పర్యటించి రైతుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో రైతు సమస్యలే ఎజెండా బస్సు యాత్ర (BUS Tour)లు చేయాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. ఇదిలాఉండగా, కేసీఆర్ బస్సుయాత్రలకు వెళ్లితే ప్రజలు, రైతుల నుంచి ఆయనకు ఎదురయ్యే మొదటి ప్రశ్న.. ‘మీరు ఇంతకాలం ఎడబోయారు సారూ’? అని జనం తిరగబడతారని కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతల ఆరోపించారు.