బడ్జెట్ కేటాయింపుల్లో రవాణా, బీసీ శాఖలకు ప్రాధాన్యత కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటవ తేదీన జీతాలు పడేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. రోజుకు 27 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని వెల్లడించారు
సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన బడ్జెట్ సన్నాహక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రెటరీ హరిత పాల్గొన్నారు. గతంలో బీసీ సంక్షేమానికి ఎన్ని నిధులు కేటాయించారు, ప్రస్తుతం ఎన్ని నిధులు కేటాయించాలనే అంశంపై చర్చించారు.
బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ , కల్యాణ లక్ష్మి, బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్‌లకు సంబంధించి కేటాయించాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపై చర్చజరిగింది.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ….మహాలక్ష్మీ పథక్ం వల్ల ఆదాయం తగ్గి ఖర్చు పెరుగుతోందన్నారు. అదనంగా కొత్త బస్సుల కొనుగోలుకు సహాయం చేయాలని కోరారు. బ్యాంకు రుణాలు , కొత్త నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
బీసీ గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏడాదికి 300 మందికి ఓవర్సిస్ స్కాలర్ షిప్ మంజూరు చేస్తుండగా వాటిని మరింత మందికి పెంచాలని భట్టిని కోరారు. మరోవైపు కళ్యాణ లక్ష్మీతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని ఇటీవల కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కళ్యాణ లక్ష్మి పథకానికి అదనంగా బడ్జెట్ లో కేటాయించాల్సిన నిధులపై ఈ సందర్బంగా చర్చించారు.
పాత జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్ లకు పక్కా భవనాలు ఉన్నాయని, ఇప్పుడు కొత్త జిల్లాలకు కూడా భవనాలను మంజూరు చేయాలని, తెలంగాణ బీసీ కుల గణన చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. దీంతో కులగణనకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం ముందు విజ్ఞప్తులు చేశారు. కుల వృత్తుల్లో చదువుకున్న వారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి స్కిల్ డెవలప్మెంట్ కి శిక్షణ కార్యక్రమాల పై అధ్యయనం చేయాలని సూచించారు..