బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే, షకీల్ (Shakeel)కు షాక్ తగిలింది. 2023 డిసెంబర్ 23వ తేదీన అర్ధరాత్రి 2.45 గంటలకు ప్రజాభవన్ (Praja Bhavan) ముందున్న బారికేడ్లను షకీల్ కొడుకు సోహెల్ (Sohel) కారుతో ఢీకొట్టాడు. అనంతరం తన కొడుకును కేసు నుంచి తప్పించే ఆలోచనతో.. దుబాయ్ పారిపోయేందుకు షకీల్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో షకీల్ పేరును పంజాగుట్ట (Panjagutta) పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు.
ఇదివరకే ఈ ఘటనలో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ కు తరలించారు. సోహెల్ ను దుబాయ్ నుంచి రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.. అయితే కేసు నుంచి సోహెల్ ను తప్పించేందుకు సీఐ దుర్గారావు ప్రయత్నించిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆయనను సైతం సస్పెండ్ చేశారు. ఆయనకు సహకరించిన ఎస్సై, హెడ్ కానిస్టేబుల్కు తాఖీదులు జారీ చేశారు.
మరోవైపు నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేసేవారు రోజురోజుకు ఎక్కువ అవుతోన్న నేపథ్యంలో, అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.. తాగిన మత్తులో ప్రమాదాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.. ఇప్పటికే పట్టణంలో చోటు చేసుకొంటున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే..