టీమిండియా (Team India) విజయాల్లో మహమ్మద్ షమీ (Mohammed Shami) కీలకపాత్ర పోస్తున్న విషయం తెలిసిందే. తన అసమాన ఆటతో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 7 వికెట్లు పడగొట్టి ప్రపంచకప్ వేటకు రాచబాటవేశాడు. ఈ మ్యాచ్‌తో అతడు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. రాజకీయ, క్రికెట్, అభిమానులు, సినీతారలు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు షమీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మహమ్మద్ షమీపై మాజీ భార్య హసీన్ జహాన్ (Hasin Jahan) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షమీ ఓ మంచి ఆటగాడిలానే.. మంచి భర్త అయ్యుంటే బాగుండేది అంటూ కామెంట్ చేసింది. ఆమె వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు షమీ ఫ్యాన్స్ ఆమెపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇంతకీ హసీన్ ఏమందంటే.. ‘మహమ్మద్ షమీ ఎంత మంచి ఆటగాడో.. అలాగే మంచి భర్తగా, తండ్రిగా ఉంటే.. మేమంతా కలిసి సంతోషంగా ఉండే వాళ్లం. దీంతో అతడికి ఇప్పుడు లభించే గౌరవం కంటే ఇంకాస్త ఎక్కువ వచ్చేది. కానీ, అతని దురాశ, చెడు ఆలోచనలు, తప్పుల కారణంగా మేము ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. షమీ డబ్బుతో నిజాల్ని దాచాలని చూస్తున్నాడు’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది.
షమీ-హసీన్ జహాన్‌లు 2018 నుంచి ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. వీరు 2014లో పెళ్లి చేసుకోగా 2015లో వారికి కూతురు జన్మించింది. కానీ 2018లో హసీన్.. షమీపై వేధింపుల కేసు నమోదుచేసింది. కొద్దిరోజుల క్రితమే గృహహింస కేసు కింద కోల్‌కతా కోర్టు షమీ, హసీన్‌కు నెలకు రూ.లక్షా 30వేలు భరణంగా చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.