అందాల భామ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇచ్చట వాహనములు నిలుపరాదు, హిట్ 2 వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా ‘గుంటూరు కారం’(Gunturu Karam) మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) సరసన నటించి మెప్పించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గూంటూరు కారం సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది మీనాక్షి చౌదరి.
‘‘సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో నటించే అవకాశం వచ్చిందని తెలియగానే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదటిరోజు మొదటి షాట్ కూడా ఆయనతోనే.. నేను చాలా టెన్షన్ పడ్డాను. నా భయాన్ని గమనించి.. టెన్షన్ పడొద్దనీ, కావాలంటే ఇంకొంత టైమ్ తీసుకోమని మహేశ్ ధైర్యం చెప్పారు. ఆయన చెప్పిన ఆ మాటలే నాలో భయాన్ని పోగొట్టాయి. ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి.’’ అని తెలిపింది.
అయితే తన కోసం తాను కొన్ని నియమాలు పెట్టుకున్నానని, అందులో ముఖ్యమైంది తన ‘కంఫర్ట్’ అని చెప్పుకొచ్చింది మీనాక్షి . ‘తెలుగు సినిమా పరిశ్రమ నా పట్ల ఎంతో ఆప్యాయత చూపుతున్నది.. భాష ఏదైనా కానీ మంచి సినిమాలు చేయాలని నా కోరిక.. అందుకోసమే ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నా.. డబ్బు కంటే ముఖ్యంగా నేను చేసే పనికి ప్రశంసలతో పాటు గౌరవం దక్కాలని కోరుకుంటున్నా..’ అని చెప్పింది.
అదేవిధంగా స్క్రిప్ట్ ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా కానీ ముందే చెప్పేస్తానని, ఈకారణంగా నేను పెద్ద పెద్ద ప్రాజెక్టులను కూడా వదిలేసుకున్నాని తెలిపింది. తెరపై ముద్దులకు సంబంధించి కూడా కొన్ని నియమాలు పాటిస్తానని, స్క్రిప్ట్ డిమాండ్‌ను బట్టి అసభ్యకరంగా లేకుంటే వాటిని చేయడానికి నేనూ సిద్ధమే అంటోంది మీనాక్షి. కానీ, కేవలం ముద్దు సీన్ల కోసమే అంటే మాత్రం నేను కచ్చితంగా వద్దంటానని తెలిపింది.