టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు(Eswara Rao) కన్నుమూశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిచిగాన్లోని కుమార్తె ఇంటికి వెళ్లిన ఈశ్వరరావు అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
దర్శకరత్న దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) దర్శకత్వం వహించిన ‘స్వర్గం నరకం’(Swargam-Narakam) చిత్రం ద్వారా ఈశ్వరరావు, మోహన్ బాబు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఈశ్వరరావు తొలి సినిమాతోనే హిట్ అందుకుని కాంస్య నంది అవార్డును అందుకున్నారు.
అదేవిధంగా ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. అప్పట్లో ఆయన సినిమాలో ఉన్నారంటే.. మన పక్కంటి వ్యక్తే ఆ సినిమాలో ఉన్నారా? అనిపించేది. ఆయన భాష, మాటతీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది.
సీనియర్ ఎన్టీఆర్తో కలిసి ఈశ్వరరావు అనేక చిత్రాలు నటించారు. ఆయన కెరియర్లో దాదాపు 200లకు పైగా సినిమాలతోపాటు టీవీ సీరియళ్లలోనూ ఆయన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్ర్భాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.