ఎన్నికల సమయంలో తనకు ఊపిరి తీసుకోవాలన్నా భయమేస్తోందని సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) అన్నారు. చెన్నై(Chennai)లోని ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఎన్నో శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
డాక్టర్ల వల్లే తాను ఇంకా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఎంతోమందికి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలుపుతున్న డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కావేరీ ఆసుపత్రి(Kaveri Hospital) ఎక్కడ అని ఎవరినైనా అడిగితే.. కమల్ హాసన్(Kamal Haasan) ఇంటి దగ్గర అని చెప్పేవాళ్లని, ఇప్పుడు కమల్ హాసన్ ఇల్లు కావేరి ఆసుపత్రి దగ్గర అని చెబుతున్నారని అన్నారు.
‘‘ఇది సాధారణంగా చెబుతున్నానంతే.. మళ్లీ నాకు, కమల్‌కు మధ్య విభేదాలున్నాయని రాయకండి. మీడియా వాళ్లు ఉంటే మాట్లాడాలంటే సంకోచిస్తున్నాను. ఈ కెమెరాలన్నీ చూస్తుంటే భయమేస్తోంది. అసలే ఎన్నికల సమయం.. నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాను” అని రజనీకాంత్ సరదాగా చెప్పారు.
రజనీ సినిమాల విషయానికి వస్తే.. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ చేస్తున్నారు. తెలుగులో ‘వేటగాడు’ పేరుతో ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మార్చి చివరికి ఈ మూవీ చిత్రీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.