బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఆమీర్‌ఖాన్ దంగల్(Dangal) సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సుహానీ భట్నాగర్(Suhani Bhatnagar) కన్నుమూసింది. ఆమె వయసు 19 సంవత్సరాలు. ఈ విషయాన్ని ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ధ్రువీకరించింది.
కొన్ని రోజుల కిందట ఓ ప్రమాదంలో కాలికి గాయమవడంతో ఆమె చికిత్స తీసుకుంటోంది. ఢిల్లీ ఎయిమ్స్ లో కొద్దిరోజులు చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఆమె వాడిన మందులు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు సమాచారం. అయితే, ఆమె మృతి వెనక అసలు కారణం తెలియాల్సివుంది. సుహానీ మృతిపై ఆమీర్ ఖాన్ చిత్ర నిర్మాణసంస్థ విచారం వ్యక్తం చేసింది.
‘‘సుహానీ మనల్ని విడిచి వెళ్లిపోయిందన్న వార్త తీవ్రంగా కలచివేస్తోంది. ఆమె తల్లి, కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అద్భుతమైన ప్రతిభ కలిగిన అమ్మాయి. ఆమె లేకుండా దంగల్ అసంపూర్ణం. మా గుండెల్లో ఎప్పటికీ ధ్రువతారలా వెలుగుతూనే ఉంటుంది. సుహానీ ఆత్మకు శాంతి చేకూరాలి” అని ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంది.
‘దంగల్’ తర్వాత పలు ప్రకటనల్లోనూ సుహానీ నటించింది. 2019 జూన్ నుంచి సినిమాలు, షూటింగ్‌లకు పూర్తిగా దూరంగా ఉంటూ చదువుపైనే దృష్టి పెట్టింది. అంతేకాదు, సోషల్ మీడియాకూ దూరంగా ఉంది. నవంబర్ 2021న ఆమె చివరి పోస్ట్ చేసింది. సుహాని భట్నాగర్ మరణవార్త తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో నివాళులర్పిస్తున్నారు.