తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయ ఆరంగేట్రానికి సిద్దపడుతున్నాడు. ఇప్పటికే నేరుగా కాకపోయినా ఈ దిశలో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన మక్కల్ ఇయక్కం అప్పుడే తమ అభిమాన హీరో పొలిటికల్ ఎంట్రీకి విధివిధానాలను రూపొందిస్తోంది. 2026 లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీకి దిగుతారన్న ప్రచారం ఊపందుకుంటోంది. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన లాయర్లతో ఆయన సమావేశం కానున్నాడని, తన భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి రానున్నాడని తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్త పర్యటనపై విజయ్ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా విజయ్ తమిళనాడులో పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాడు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఆయన గత జూన్ 17 న ఘనంగా సత్కరించాడు.
వారికి నగదు బహుమతులు అందించాడు. అయితే 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల తరువాతే ఆయన పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో సినిమాలో నటిస్తున్న విజయ్.. షూటింగ్ గ్యాప్ లో వివిధ సామాజిక కార్య కలపాల్లో కూడా పాల్గొంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాడని కూడా లోగడ వార్తలు వచ్చాయి. తమిళనాడు రాజకీయాల్లో ఈ స్టార్ హీరో ఎంట్రీ ఎప్పుడో గానీ చెన్నై వంటి నగరాల్లో అక్కడక్కడా ఈయన పోస్టర్స్.. ‘పొలిటికల్ కలర్’ ఇచ్చుకుని కనిపిస్తున్నాయి.