అధికార వైసీపీ(YCP)లో సీట్ల మార్పులు, చేర్పులు జరుగుతోన్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏ నాయకుడు ఎప్పుడు రాజీనామా ప్రకటన చేస్తాడో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా, కృష్ణాజిల్లా(Krishna District) పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి(Partha Saradhi) పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆయనతో వైసీపీ నేతలు చర్చలు జరిపినా ఆ ఎపిసోడ్ ఇంకా కొలిక్కిరాలేదు.. మరోసారి పార్థసారథితో వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి 30నిమిషాల పాటు చర్చలు జరిపారు. మంగళవారం పార్థసారథి సీఎం వైఎస్ జగన్‌ను కలిసినా ఆయనలో అసంతృప్తి తగ్గినట్లు కనిపించడంలేదు. వచ్చే ప్రభుత్వం కేబినెట్లో బెర్త్‌పై హామీ కోసం పార్థసారథి పట్టుబడుతున్నట్లు సమాచారం.
సారథితో జరిపిన చర్చల సారాంశాన్ని రామిరెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరి, దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తోంది చూడాలి. మరోవైపు పార్థసారథి టీడీపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. టీడీపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపడమే అందుకు కారణం. పార్థసారథి ఇంటికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు వెళ్లి భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మొండితోక అరుణ్‌కుమార్ కూడా అక్కడికి వెళ్లారు. అయితే, ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఉమ్మడి ఏపీలో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కేబినెట్ విస్తరణలో పదవి ఆశించి భంగపడిన ఆయన అసంతృప్తితో ఉన్నారు. తాజా పరిణామాలు పార్థసారథి పార్టీ మార్పు ఖాయంగానే కనిపిస్తోంది.