సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) సెలబ్రెటీలు (Celebrities)లను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు ఇప్పుడు సెలబ్రెటీల ఫొటోలు అడ్డం పెట్టుకుని ఫేక్ మొబైల్ నెంబర్లతో మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ మధ్య కాలంలో ఈ ఫేక్ అకౌంట్ల బారిన పడిన సెలబ్రెటీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఆ లిస్టులో బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్(Vidyabalan) చేరింది. తాను సోషల్ మీడియాలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.
నకిలీ ఖాతాలు, వరుసగా రెండుసార్లు ఇన్‌స్టా ద్వారా తన పేరుతో నకిలీ ఫోన్‌నెంబర్లు చలామణి అవుతున్నాయని తెలిపింది. ఆ నంబర్‌తో ఓ వ్యక్తి తన పేరుతో అందరికీ ఫోన్లు చేస్తున్నాడని, వాట్సాప్ డీపీలో కూడా తన ఫొటోనే ఉంచుకుని తప్పుదోవ పట్టిస్తున్నాడని వాపోయింది.
మరొకరైతే.. తన పేరును సూచించేలా ఫేక్ ఇన్‌స్టా అకౌంట్ తెరిచారని చెప్పింది. తన లాయర్లు ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని హెచ్చరించింది. ఆ ఫోన్ లేదా అకౌంట్ నుంచి సందేశాలు అందితే పట్టించుకోవద్దని విద్యాబాలన్ సూచించింది.