బిగ్‌బాస్(Big boss) తెలుగు సీజన్ 7(Telugu season-7) విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ గెలుపొందిన తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. ఈ షోతో ప్రశాంత్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో.. అంత అపవాదు మూటగట్టుకున్నాడు. హౌస్ నుంచి బయటకు రాగానే.. ఫ్యాన్స్ విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పల్లవి ప్రశాంత్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. దీంతో కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ప్రశాంత్‌కు మద్దతుగా ఉన్న శివాజీ ఈ ఘటనపై తొలిసారి స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
‘ప్రశాంత్ చాలా మంచివాడు.. గెలిచాననే ఆనందం ఒక్కోసారి మనిషిని డామినేట్ చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎగ్సైట్ అయ్యి.. ర్యాలీలో పాల్గొన్నాడు.. బయట జరిగిన గొడవ గురించి ప్రశాంత్ కు తెలియదు. చట్టాన్ని గౌరవించి, త్వరలోనే బయటకు వస్తారని ఆశిస్తున్నా.. చట్టాన్ని అతిక్రమించాడనే నెపం మోపబడ్డ వ్యక్తి. అతడు నిర్దోషి..’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు.
అదేవిధంగా పల్లవి ప్రశాంత్ అరెస్టుపై ప్రజావాణిలో లాయర్ రాజేశ్ ఫిర్యాదు చేశారు. ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేశారని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు తమకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని లాయర్ ఆరోపించారు. ప్రశాంత్ అరెస్టుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.